22 మే 2011

చావులేని మీ రాతలేగా మా తోడు ఉన్నది...
నేటికి ఒక్క ఏడాదైయింది - తెలుగు సినిమాల్లో పాటల పారిజాతాలను పూయించిన చెట్టు కొత్త పూవులనివ్వడం మానుకొని. కొత్త పువ్వులు లేవుగాని, పాతపువ్వులు మాత్రం తెలుగు భాష ఉన్నంత కాలం సుగంధాన్ని విరజిమ్ముతూనే ఉంటాయి. అటువంటి నిత్య పరిమళ పూవులను తెలుగుపాటల్లో పూయించిన ఘనత వేటూరి సుందరరామమూర్తి గారిదే. మానవుడి జీవితంలో చోటుచేసుకునే ప్రతి సంఘటనకీ సరిపోయే సందర్భోచితమైన పాటలు ఎన్నెన్నో రాశారు గురువు గారు. చివరికి మరణాన్ని కూడా క్లుప్తంగా, అద్భుతంగా, పామరభాషలో పాటగా రాశారు. మరణం బాధపడే విషయం కాదు, అది మరో అంతస్తుకు తీసుకెళ్ళే ప్రక్రియ అన్నారు! నా స్వార్థమో ఏమోగాని ఆయన పై అంతస్తుకుడు ఎక్కడాన్ని మనసు అంగీకరించలేదు! కన్నీళ్ళు ధారలై  కారేలా ఏడ్చాను. గత 14 వసంతాలుగా నేను ఆరాధిస్తున్న సినిమా కవి వేటూరి. ఆయన పాటలు నా చెవుల్లో పడని రోజంటూలేదు; ఆయన రచించిన పదాలు రోజులో ఏదో ఒకసమయానైనా నా పెదవులు పలకవలసిందే!

అప్పుడప్పుడూ ఆయన లేరన్న నిజాన్ని ఓదారుస్తూనే నాకు గుర్తుచేసే పాట ఇది...

======================
======================

పల్లవి
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు


చరణం 1
తల్లడిల్లి పోతుంది తల్లి అన్నది
బొట్టురాల్చుకుంటుంది కట్టుకున్నది
పాడెయెత్తడానికే స్నేహమన్నదీ
కొరివి పెట్టడానికే కొడుకు వున్నదీ


చరణం 2
పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు
ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది
కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది
చావు బతుకులన్నవి ఆడుకుంటవి
చావులేని స్నేహమే తోడు వుంటది

చిత్రం : జెమిని
గళం : వందేమాతరం శ్రీనివాస్
సంగీతం : ఆర్ పి పట్నాయక్
దర్శకత్వం : శరణ్
======================
======================

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు


తల్లడిల్లి పోతుంది తల్లి అన్నది - వేటూరి మరణించకు ముందే వారి తల్లి మరణించారు. కానీ వేటూరి మరణ వార్త విని తట్టుకోలేక తెలుగుతల్లి ఏడ్చినది వాస్తవం!

బొట్టురాల్చుకుంటుంది కట్టుకున్నది - ఆయన మృతదేహాన్ని చివరిసారిగా చూద్దామని హైదరాబాదు వెళ్ళాను. వార్త విన్నప్పటినుంచి అక్కడికి వెళ్ళి చూశాకా కూడా గుండలనిండా బాధే ఉన్నదికాని, గట్టీగా ఏడుపో, కన్నీళ్ళో రాలేదు. విలపిస్తున్న వేటురి గారి సతీమణిని చూడగానే నాకళ్ళు కొలనులైపోయాయి. అప్పటికర్థమైంది నిజానికి తెలుగు సాహిత్య ప్రపంచానికన్నా ఎక్కువగా నష్టపోయినది ఈవిడే అన్న వాస్తవం. ఎంత అపురూపంగా చూసుకుని ఊంటారో?

పాడెయెత్తడానికే స్నేహమన్నదీ - మృతదేహానికి స్నానం చేయించడానికి కొంచం పక్కకు తరలించవలసినప్పుడు ఆయన ఉన్న శవపేటికను ఎత్తే భాగ్యం ఈ ఏకలవ్యుడికి కలిగింది.
పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు - మీ పాటలే మాకిక తోడు!
వున్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు - మీ రచనలే మాకు చెరిగిపోని గురుతులు!

==============================================

Movie : Gemini

Singer  : Vandemataram Srinivas

Music : R P Patnaik

darSakatvaM : SaraN


pallavi

chukkallOkekkinADu chakkanODu

eppaTikee evvarikee chikkanODu


charaNaM 1

tallaDilli pOtuMdi talli annadi

boTTurAlchukuMTuMdi kaTTukunnadi

pADeyettaDAnikE snEhamannadee

korivi peTTaDAnikE koDuku vunnadee


charaNaM 2

pOyinODu ikarADu evaDikevaDu tODu

unnavADu pOyinODi gurutu niluputADu

nuvvu tinna mannErA ninnu tinnadi

kanneeLLaku kaTTe kooDA Aranannadi

chAvu batukulannavi ADukuMTavi

chAvulEni snEhamE tODu vuMTadi


==============================================