24 సెప్టెంబర్ 2010

రాసే చేతికి మోమాటం...


నిద్రలో కలలకన్నా పగటిపూట తీరిగ్గా కూర్చుని కనే కలలు ఎంతో ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే నిద్రలో కలల topic మఱియూ theme మీద మనకు కంట్రొల్ ఉండవు. అయితే పగటిపూట కూర్చుని కనే కలలో మనమనసుకు ఆ సమయాన ఆహ్లాదమిచ్చే topic మఱియూ theme నే ఎంచుకుంటాము. అదీ యవ్వనంలో కనే పగటికలలు ఎంతో మధురమైనవి. చిలిపితనాన్నంతా inkలాచేసి పెన్నులోపోసి రాసిన ప్రేమలేఖలా ఉంటుంది. పెళ్ళి నిశ్చయమయ్యాక పెళ్ళిరోజుకై నిరీక్షిస్తున్న కన్నెపిల్ల కనే కలలను కాబోయోవారికి లేఖగా రాస్తే ఆ ఊహలు ఎంత మధురాతిమధురంగా ఉంటాయో. పల్లెటూరికేగల అమాయకత్వమూ గడుసుదనమూ నిండిన పదహారణాల తెలుగమ్మాయి కాబోయేవారికి తన కలలనూ కోర్కెలనూ లేఖరాస్తే ఎలా ఉంటుంది? ఈ పాటలా ఉంటుంది...

చిత్రం :: పెళ్ళి సందడి
సంగీతం :: యం యం కీరవాణి
గాయకులు :: చిత్ర
రచన : వేటూరి

కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాలై లేఖ

పల్లవి
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే
నిన్ను చూసినాక నిదరైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది ఏనాడని... అంటూ
విడ్డూరం కాకపోతే జాంచెట్టు ఎదురు చూడ్డమేంటి? చిలకమ్మ కుశలం అడగడం ఏంటంటున్నారా? అదే ప్రేమకున్న పవర్. చుట్టురా ఉన్న ప్రతి వస్తువుకీ మానుష్యాన్ని పోస్తుంది. నిన్ను చూసిన రోజునుంచి రాత్రీ-పగలూ అని తేడా లేకుండా మధురమైన కలలో మునిగిపోయి పెళ్ళిమంత్రాలు వినుటకై వీక్షిస్తూ ఉంది నా మనసు. మహాశయా నీ బిగి కౌగిట ఆనందంగా, హాయిగ కరిగిపోయేది ఎప్పుడో? ప్రేమలేఖను ఇంతకన్నా గొప్పగా మొదలుపెట్టడాని వీలుందా?

Yes, you are my dream girl
నా కలల రాణి నా కళ్ళ ముందు; అద్భుతం, అవును అద్భుతం, మన కలయిక అద్భుతం!
ఈ కలయిక ఇలాగే ఉండాలి! Promise? Promise!


చరణం 1
నిన్ను చూడందే పదే పదే పడే యాతన; తోట పూలన్నీ కనీ వినీ పడే నా వేదన
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా? పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెన
చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం తలచి వలచి పిలచి అలసి
నీరాకకోసం వేచియున్న ఈ మనసుని అలుసుగ చూడకని... అంటూ...
నిన్ను చూడకుండ నా మనసు ఎంత యాతన పడుతుందీ నీకు తెలుసా? నా తలలో తురుముకునే ఈ తోటలోని పువ్వులనడుగు అవి చెప్తాయి నా వేదనను నీకు. నీ రాకకై నా మది పరిపరి వదాలుగా పరితపిస్తుంది. నువ్వుగనుక రాకపోతివా ఈ పూవ్వుల తీగలతో ఉరేసుకుంటాను. ఇక్కడ వేటురి ఎంత చమత్కారో తెలుస్తుందా? లేకపోతో గొంతుకు పడే ఉరిని ఎవరైనా దీవెన అని వర్ణించగలరా? నీకై నిరీక్షించి చూస్తున్న కన్నులలో ఎంతో ఆరాటం. నిన్ను వలచి నీ గురించి తలచి నా మది కంటున్నా చిలిపి కలలను లిఖించుటకు నా చేతులు మొహమాటపడుతున్నాయి. ప్రాణాలంతా నీమీదే పెట్టుకునున్నాను; అందుకని నన్ను అలుసుగ తీసుకోకు...

చరణం 2
పెళ్ళిచూపుళ్ళో నిలేసిన కథేమిటోమరి? జ్ఞాపకాలల్లో చలేసిన జవాబు నువ్వని
సంధ్య పొద్దుల్లో ప్రతీక్షణం యుగాలయ్యినా; నీటికన్నుల్లో నిరీక్షణం నిరాశ కాదని
తప్పులు రాస్తే మన్నించు తప్పక ధర్శనం ఇప్పించు యదటో నుదుటో యచటో మజిలి
నీమీద ప్రాణం నిలుపుకున్న మా మనవిని విని దయ చేయమని... అంటూ....
సరే ఆరోజు పెళ్ళిచూపుల్లో అందరి మధ్యన సిగ్గుతెరలలో తలవంచుకుని ఉన్న నామీద చూపులేఖ విసిరావే? దాని భావమేంటయ్యా? చలికాలం నా ఏకాంతన్ని వేదించుతుంటే నీ జ్ఞాపకాలతో చలికాచుకుంటున్నాను. రోజంతా ఎలానో నీ గురించిన ఆలోచనలతో గడిపేస్తున్నాను. ఈ సాయంత్రమైతేనే పెద్ద ఇబ్బంది. చీకట్లో సమయానికి కళ్ళుకనపడడంలేనట్టుంది. క్షణదూరం కదలటానికి యుగమంత సమయం పడుతున్నట్టుంది. నీరుపొంగుతూ నీకై నిరీక్షిస్తున్న నా కన్నులను నీరాశపరచకు. ఈ లేఖలో ఏమైనా తప్పులు రాసుంటే మన్నించు. అయితే తప్పకుండా దర్శన భాగ్యం మాత్రం అందించు. నీ దర్శనానికై ఎదలోనో నుదిటిమీదో ప్రాణం పెట్టుకుని ఎదురు చూస్తున్నాను.

Tail Note :
అవి నా కాలేజీ రోజులు. టీవీ నిత్యావసర వస్తువుగా అప్పటికి మారలేదు. వినే శ్రోతల Creativity జ్వాలకు ఆజ్యం పోసే రేడియో రోజులు అవి. సాయంత్రం మూడింటికి కాలేజీ అయిపోగానే స్నేహితుల బృందంతో మెరినా బీచ్ కి వెళ్ళి సాగరతీరాన ఓ రెండు గంటలు కూర్చుని రేడియోపాటలు వింటూ కాలక్షేపం చేసిఇళ్ళకు వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో మెడ్రాసు రేడియోలో 4 గంటలకు తెలుగు పాటలు ప్రసారం చేసేవాళ్ళు. అప్పట్లో ప్రతిరోజూ మా పెరటి జాంచెట్టు... పాట ప్రసారమయ్యేది. అనౌంసర్లకు కూడా ఆ పాట అంత ఫేవరైట్ ఉండేది ఆ పాట. పాటంతా తెలుగుతనంతో నిండినభావాలు. ఆ పాట నాకు ఎంతగా నచ్చిందంటే "పెళ్ళంటూ చేసుకుంటే పల్లెటూరి అమ్మాయినే చేసుకుంటాను" అని ప్రకటించాను. మరికొందరు అబ్బాయిలు కూడా ఆలానే చెప్పేవారు. మా స్నేహితుల బృందంలో అమ్మాయిలు "మీ అబ్బాయిలందరూ ఇలా నిర్ణయం తీసుకుంటే మాలాంటి పట్టణం అమ్మాయిల పరిస్తితి ఎంటి?" అని ప్రశ్నించేవారు. అది జరిగిన కొంతకాలానికి ఆ సినిమా చూసే అవకాశం వచ్చినప్పుడు ఆ పాటను చూసి దర్శకుడు రాఘవేంద్రరావును ఎంతగా తిట్టుకున్నానో....

To read the above on RTS(in eglish text) click here

04 సెప్టెంబర్ 2010

నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా?

===================================================
ఈ పోస్ట్
చావా కిరణ్ కి
(ఈ టపా రాయడానికి ప్రేరేపణ ఇచ్చింది చావా కిరణ్ పెట్టిన ఒక Buzz)
===================================================

మణిరత్నం తీసిన ఇద్దరు సినిమా, వాణిజ్యపరంగా అంత హిట్ కాదు. పాటలు మాత్రం సూపర్ హిట్. సినిమా పాటల్లో సాహిత్యం కావాలనుకునే వాళ్ళకు ఈ సినిమాలో పాటలు నచ్చుతాయి. ఈ సినిమా తమిళంలో తీశారు. 1950 ప్రాంతంలో తమిళనాడు రాజకీయ, సినీపరిశ్రమలలో జరిగిన పరిణామాల ఆధారంగా తీయబడింది.

దర్శకుడికి సాహిత్య అభిరుచి ఎక్కువ. ఇది ఆయన తీసిన సినిమాలలో పాటలు వింటే అర్థం అవుతుంది. ఈ సినిమాలోని ఒక ముఖ్యపాత్ర రచయిత. మరొక పాత్ర నటుడు. మణిరత్నం ఈ సినిమాకు కవితలూ, పాటలూ ఎప్పట్లాగానే కవిరాజు వైరముత్తుగారిచే రాయించారు.  తెలుగులో దానిని తలతన్నేవిదంగా రాశారు వేటూరి గారు.

ఈ తమిళ పాటకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పాటలోని భాష సంగం(2000 years old) నాటి పద్యభాష. ఇందులోని ఏ ఒక్క పదముకూడా ఇంతకు మునుపు వచ్చిన సినిమా పాటలలో కనపడవు.

తెలుగు వర్షన్ లో సాహిత్యం గొప్పగా ఉందా లేక తమిళ వర్షన్ లో సాహిత్యం గొప్పగా ఉందా అనికాకుండ రెండిట్లోను సాహిత్యం గొప్పగానే ఉంది అన్నది నా భావన...

చిత్రం : ఇద్దరు
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : ఏ.ఆర్. రహ్మాన్
కంఠస్వరం : ఉన్నికృష్ణన్, బి.జయశ్రీ


పల్లవి :
 

అతడు :
శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా?
(తమిళం)
నఱుముగైయే నఱుముగైయే నీయొరు నాళిగై నిల్లాయ్
సెంగని ఊఱియ వాయ్ తిఱందు నీయొరు తిరుమొళి సొల్లాయ్
అట్రైత్ తింగళ్ అన్నిలవిల్ నెట్రిత్ తరళ నీర్ వడియ కొట్రప్ పొయ్‌గై ఆడియవళ్ నీయా?
పరిమళించే మొగ్గ పోలిన దానా నువ్వొక  గడియ ఆగుము
కెంపుఫలములూరిన నోరు విప్పి నువ్వొక శుభవార్త చెప్పు
అలజాబిలి వెన్నెలలో నుదుట ముత్యాల్లా నీరుజారగ తటాకమున జలకాలాడినది నీవా?
(నాళిగై - గడియ - 24 నిముషాలు; 60 గడియలు ఒక రోజు. తింగళ్ - జాబిలి )

ఆమె :

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా?
(తమిళం)
తిరుమగనే తిరుమగనే నీయొరు నాళిగై పారాయ్

వెణ్ణిఱ పురవియిల్ వందవనే వేల్విళి మొళిగళ్ కేళాయ్
అట్రైత్ తింగళ్ అన్నిలవిల్ కొట్రప్పొయ్గై ఆడుగైయిల్ ఒట్రైప్పార్వై పార్తవనుం  నీయా?
శ్రీమంతుడా శ్రీమంతుడా నువ్వొక గడియ చూడవోయ్
తెల్లటి గుఱ్ఱంలో వచ్చినవాడా, ఈటెకన్నులుగల నా పలుకులు వినవోయ్
అలజాబిలి వెన్నెలలో తటాకంలో నే జలకాలాడుతుండగ ఒక్క చూపు విసిరినది నీవా?


చరణం 1

అతడు : మదన మోహిని చూపులోన మాండు రాగమేల?
ఆమె   : పడుచు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా?
అతడు : అలా ఇలా మేఘ మాసం క్షణానికో తోడి రాగం!
ఆమె   : చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కటిని గిల్లే!


తమిళ చరణం 1

అతడు : మంగై మాన్విళి అంబుగళ్ ఎన్ మార్బుళైత్తదెన్న?
(మగువ 'లేడి' కన్నుల బాణాలు/తూపులు నా రొమ్ముచీల్చుతున్నదేమిటి)
ఆమె : పాండి నాడనై కణ్డు ఎన్ ఉడల్ పసలై కొండదెన్న?
(పాండియదేశరాకుమారుని చూసిన నా తనును విరహము చెందెనేల?)
అతడు : నిలావిలే పార్త వణ్ణం కనావిలే తోండ్రుం ఇన్నుం!
(నాడు వెన్నెలలో చూసిన నీ రూపం, కనులలోనే మెదిలే నేడు)
ఆమె : ఇళైత్తేన్ తుడిత్తేన్ పొఱుక్కవిల్లై. ఇడైయిల్ మేగలై ఇఱుక్కవిల్లై!
(నీకై (విరహంతో) చికిపోయాను, విలవిలపోయాను, ఓర్చుకోలేకపోతున్నాను.
నీ విరహంలో నేనెంతగా చిక్కిపోయానంటే  తొడిగిన ఒడ్డాణము కూడా వదులైపోయినది. నడుమున నిలబడడం లేదు)

చరణం 2

ఆమె   : నెయ్యం వియ్యం ఏధేనైన తనువు నిలువదేలా?
(నెయ్యము -వలపు; వియ్యము - వైవాహిక సంబంధం; ఏధ-ఎదుగుదల
మన వలపు కళ్యాణంవరకు ఎదిగినది, అయినా ఈ తనువు ఆగదెందుకు? - తప్పతే తెలియచేయండి)
అతడు : నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా?
ఆమె   : ఒకే ఒక చైత్ర వీణ పురేవిడి పూతలాయే!
అతడు : అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జత చేరే!

తమిళ చరణం 2
ఆమె : యాయుం జ్ఞాయుం యారాగియరో నెంజు నేర్న్‌దదెన్న?
(మీ కన్నవారికీ, నా కన్నవారికీ ఏ బంధుత్వమూలేదు; అయినా మన ఎదలలో ఏం జరిగింది?)
అతడు : యానుం నీయుం ఎవ్వళి అఱిదుం ఉఱవు సేరందదెన్న?
(నేనూ నీవూ వేర్వేరు స్థాయి వారమని తెలిసీ మన వలపెలా కుదిరింది?)
ఆమె : ఒరే ఒరు తీణ్డల్ సెయ్దాయ్ ఉయిర్ కొడి పూత్తదెన్న?
(నీ ఒకేయొక స్పర్షతో నా ప్రాణలత పూసిందెలా?)
అతడు : సెంబులం సేరంద నీర్తుళి పోల్ అంబుడై నెంజం కలందదెన్న?
(ఎర్రమట్టి భూమిలో పడిన నీట్చుక్కలా ప్రేమించే మనసులు కలిసిందెలా?)

రెండవ తమిళ చరణం లో మూడవ లైన్ మినహా, మిగతావి 2000 వేల సంవత్సరాల క్రితం రాయబడిన కుఱుందొగైలోని పద్యం లో నుండి అలానే వాడుకున్నారు.

= = = X X X = = =
తెలుగు వర్షన్‌ని ఇక్కడ వినండి
http://www.youtube.com/watch?v=QlbdOEbzzwA

తమిళ వర్షన్‌ని ఇక్కడ వినండి
http://www.youtube.com/watch?v=joJHN_VfY88

02 సెప్టెంబర్ 2010

మనసు అడిగిన ఆ మనిషెక్కడో - నా పిలుపే అందని దూరాలలో!

22 మే 2010, శనివారం రాత్రి సమయం పదయింది. ఆషాకి ఒంట్లో బాగలేదు. డక్టర్ చెప్పిన ట్యాబ్లెట్లు వేసుకుని, నిద్రపట్టక టీవీ చూస్తుంది. నేను కంప్యూటర్లో పాటలు వింటున్నాను. ఆష గట్టిగా పిలిచింది. ఏమైందో ఏమోనని కంగారుతో వెళితే,

"వేటూరి చనిపోయారంట! ఫ్లాష్ న్యూస్ వస్తోంది" ఆష హీనస్వరంలో చెప్పింది!

అలాగే కిందకు వాలిపోయాను. మాటలు రావడంలేదు. ఇది కల అయితే బాగుండు. నన్నెవరన్నా ఇప్పుడు నిద్రలేపేయండి అని అరవాలనిపించింది! టీవీకేసి చూస్తున్నాను గాని ఆ ఫ్లాష్ న్యూస్ అక్షరాలు కనపడడంలేదు. కన్నులు కమ్మేశాయి. మరో ఛానల్ మార్చింది. అందులోనూ అదే న్యూస్ చదువుతున్నారు. కన్నీళ్ళు ఆగడం లేదు. ఇంటర్నెట్లో మిత్రులనడిగాను. వారూ అదే వార్తతో బాధపడుతున్నారు.

వేటూరి చనిపోవడం ఏంటి? అసలు అది సాధ్యమా? రాలిపోని పువ్వనుకున్నాను వేటూరిని.

నాకు కాలం స్తంబించింది. కందెన లేకుంటే భూచక్రం ఎలా తిరుగుతుంది? కన్నీళ్ళతోబాటు ఆలోచనలూ అల్లుకుపోతున్నాయ్!  ఇందాకకూడా పాట వింటూ వేటూరికి ఒక శభాష్ చెప్పానే, అయితే నా ఈ "శభాష్"ని అందుకోలేదా అయన? అంతకుముందు "చుక్కూళ్ళోకెక్కినాడు చక్కనోడు..." పాటవింటున్నప్పుడే ఆయణ ప్రాణం పోయుంటుందా? నాలో కన్నీళ్ళూ, ప్రశ్నలూ, ఆలోచనలూ పౌర్ణమి రేయి సాగరతీరంలా ఇంకా ఇంకా పెర్గుతున్నాయ్!

"నువ్వు హైదరబాదుకు వెళ్ళి చూసిరా" ఆష చెప్పింది.
"నీకు బాగలేనప్పుడు ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళను?"
"నాకేం పర్లేదు, నువ్వు వెళ్ళి చివరిసారిగా చూసిరా. తెల్లవారికి టిక్కేట్లు ఉన్నాయా చూడు" అని ల్యాప్టాప్ తెచ్చి ఇచ్చింది ఆష.

నా అధృష్టం. ఒకే ఒక 8:45 ఫ్లైట్లో మాత్రం తిక్కెట్లు ఉన్నాయ్. మోహన్‌కి ఫోన్ చేసి చెప్పాను. తనూ వస్తానన్నాడు. రెండు తిక్కెట్లు బుక్ చేశాను. ఆషాకు బాగలేదు, ఒంటరిగా వదిలేసి వెళ్ళాలి అన్న బాధ, ఇంక కొత్తగా వేటూరి పాటలు ఏవీ రావ్వు అన్న బాధ - అసలు నిద్ర రాలేదు. మనసంతా ఆయన రాసిన విషాద గీతాలు మెదలుతున్నాయ్.
నా చుట్టూ ప్రపంచం నిద్రపోతుంది. నేను మాత్రం మరణాన్నీ, వేటూరినీ నిందిస్తున్నాను! ఆయన భాషలోనే

మదికే అతిధిగ రానేలనో - సెలవైనా అడగక పోనేలనో
ఎదురుచూపుకు నిదరేది - ఊగెను ఉసురే కన్నీరై;
మనసు అడిగిన ఆ మనిషెక్కడో - నా పిలుపే అందని దూరాలలో!


ఆకలీ, నిద్ర ప్రేమలోపడ్డవారికేకాదు వియోగంలో ఉన్నవారికి కూడా ఉండవేమో. తెల్లవారి అద్ధంలో మొహం చూస్కుంటే నాకే నేను అన్యుడిలా కనపడుతున్నాను. హోసూరుకెళ్ళి మోహన్‌ని  పిక్కప్ చేసుకున్నాను. మాకు ఏం మాట్లాడుకోవాలో తోచలేదు. మౌనంగా రెండుగంటల్లో airport చేరుకున్నాము. కిటికీనుంచి ఆకాశానికేసి చూస్తున్నాను, చనిపోయిన వేటూరి గారు కూడ తారలా మారుంటాడేమోనని. వేటూరి తారగా మారడం ఏంటి? ఆయన తేజోవంతుడు; సూర్యుడౌతాడు గాని, తారకాడు! హైదరబాదులో దిగి, ఆయన నివాసం వెతికి చేరుకున్నాము. ఆయన భౌతికకాయం చూడగానే అంతవరకు ఏడ్చిన ఏడుపు ఏమైందో తెలియదు. కంట్లో ఒక చుక్క కన్నీరైనా రాదు. కొన్ని నిముషాలు వేటూరిని చూస్తూ శిలైపోయాను. "మదికే అతిథిగ రానేలనో - సెలవైనా అడగక పోనేలనో?" అని ఆయన మాటలతోనే అడుగాలనిపించింది. ఇకపైన వేటూరి కలంనుంచి ఇంకో కొత్తా పాట వినే భాగ్యం ఈ తెలుగు దౌర్భాగ్యులకు లేదు. 

చిత్రం : సఖి
 
ప్రేమలే నేరమ ప్రియా ప్రియా
వలపు విరహమా ఓ నా ప్రియా
మనసు, మమత ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో!

పల్లవి

కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు.
మదికే అతి
థిగ రానేలనో;
సెలవైనా అడగక పోనేలనో.
ఎదురుచూపుకు నిదరేది;
ఊగెను ఉసురే కన్నీరై.
మనసు అడిగిన ఆ మనిషెక్కడో;
నా పిలుపే అందని దూరాలలో!


చరణం 1

అనురాగానికి స్వరమేది?
సాగరఘోషకు పెదవేది?
ఎవరికివారే ఎదురుపడి -
ఎదలు రగులు ఎడబాటులలో.
చివరికి దారే మెలికపడి -
నిను చేరగ నేనీ శిలనైతిని!
ఎండమావిలో నావనులే -
ఈ నిట్టూర్పే నా తెరచాపలే!


చరణం 2

వెన్నెల మండిన వేదనలో,
కలువ పువ్వులా కలతపడి.
చేసిన బాసలు కలలైపోతే -
బ్రతుకే మాయగ మిగులుననీ.
నీకై వెతికా కౌగిలినై -
నీడగ మారిన వలపులతో.
అలిసి ఉన్నాను ఆశలతో -
నను ఓదార్చే నీ పిలుపెన్నడో!


ఒరిజినల్ తమిళ సినిమాలో ఈ పాట వైరముత్తు గారు 1984లో రాసిన ఒక ఛందోబద్ధమైన పద్యం. ఆ తరువాయి ఈ కవిత "తేన్ వందు పాయుదు" అన్న కవితల ఆడియో ఆల్బంలో  వైరముత్తుగారి కంఠస్వరంలో, సుహాసిని మణిరత్నం ముందుమాట కంఠస్వరంతో , రహ్మాన్ గారి నేపద్య సంగీతంలో ఆడియో రూపంలో ఎంతోమంది తమిళుల్ని ఆకట్టుకుంది. మణిరత్నం చక్కగా తన సినిమాలో (అలైపాయుదే - తెలుగులో "సఖి‌") వాడుకున్నారు. ఎంతగా నచ్చిందో ఏమో మరి ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు రహ్మాన్.

ఈ పాట సినిమాలో అశరీరిగా వస్తుంది. దీనికి తెలుగు వర్షన్ రాసేటప్పుడు మిగతా డబ్బింగు పాటలకు ఉండే లిప్ సింక్ ఇబ్బందులు అసలు లేదు. తమిళ భావాన్ని పక్కకు పెట్టేసి సినిమాలోని సన్నివేశానికి తగిన గొప్ప భావాన్ని ఎంచుకున్నారు వేటూరి గారు. ఒరిజినల్ తమిళ భావానికన్నా తెలుగు వర్షన్‌లోని భావాం చాల గొప్పగా, సినిమా సన్నివేశానికి చాలా దగ్గరగా ఉంది. వేటూరి గారి ప్రతీభను ప్రతి లైన్‌లోను చూడొచ్చు ఈ పాటలో. పాట పాడినవారు స్వర్ణలత గారు. ఆమే ఈ పాటలోని ప్రతి పదాన్ని ఎంతో అనుభవించి పాడారు.

వేటూరి తమిళ భావానికన్నా బాగరాశాడు అంటే మీరు నమ్మరేమో.
అందుకే తమిళ వర్షన్ కి డిట్టొ అనువాదం ఇస్తున్నాను ఇక్కడ.

పల్లవి
ఎవనో ఒరువన్ వాసిక్కిఱాన్ - ఇరుట్టిల్ ఇరుందు నాన్ యాసిక్కిఱేన్
తవం పోల్ ఇరుందు యోసిక్కిఱేన్ - అదై తవణై ముఱైయిల్ నేసిక్కిఱేన్
కేట్టు కేట్టు నాన్ కిఱంగుగిఱేన్ - నాన్ కేట్పదై అవఓ అఱియవిల్లై
కాట్టు మూంగిలిన్ కాదుక్కుళ్ళే - అవన్ ఊదుం రగసియం పురియవిల్లై
 

ఎవడో ఒకడు (వేణువు) వాయించుచున్నాడు - (ఇక్కడ) చీకట్లో నేను యాచించుచున్నాను
తపస్సులా ఉండి యోచించుచున్నాను - దాన్ని(వేణు గానాన్ని) తేపలుతేపలుగా ఆరాదిస్తున్నాను
వింటూనే పారవశ్యం చెదుతున్నాను - నేను వింటున్న సంగతేమో వాడెఱుగడు
ఆ అడవి వెదురు(వేణువు) చెవిలో - వాడు ఉదే రహయం అర్థంకాలేదు!


చరణం 1
పుల్లాంగుళలే పూంగుళలే నీయుం నానుం ఒరు జాతి
ఉళ్ళే ఉఱంగుం ఏక్కత్తిలే ఉనక్కుం ఎనక్కుం సరి పాది
కణ్గళై వరుడుం తేనిసైయిల్ ఎన్ కాలం కవలై మఱందిరుప్పేన్
ఇనిసై మట్టుం ఇల్లై ఎన్ఱాల్ నాన్ ఎన్ఱో ఎన్ఱో ఇఱందిరుప్పేన్


 ఓ పిల్లనగ్రోవీ! నువ్వూ నేనూ ఒకే శ్రేణికి చెందినవారము;
(వేణు గానం)లోపల దాగున్న నిట్టూర్పులో నీకూ నాకు చెరిసగము!
కనులను నిమిరే సంగీతములో సమయాన్నీ, బాధల్నీ మరిచిపోతున్నాను!
ఈ సంగీతము మాత్రం లేనిచో నేనెన్నడో మరణించి ఉంటాను!
చరణం 2
ఉఱక్కం ఇల్లా మునిరవిల్ ఎన్ ఉళ్ మనదిల్ ఒరు మాఱుదలా
ఇరక్కం ఇల్లా ఇరవుగళిల్ ఇదు ఎవనో అనుప్పుం ఆఱుదలా
ఎందన్ సోగం తీర్వతఱ్కు ఇదు పోల్ మరుందు పిరిదిల్లైయే
అంద కుళలైప్ పోల్ అళువదఱ్కు అత్తనై కణ్గళ్ ఎనక్కిల్లైయే


నిద్దురలేని రాత్రులలో నా మదిలో ఒక మార్పా
కరుణేలేని రాత్రులకు ఎవరో పంపే ఓదార్పా!
నా శోకం తీరుటకు ఇలాంటి ఔషధము వేరొకటిలేదు
ఆ గ్రోవిలా ఏడ్చుటకు అన్ని కన్నులు నాకు లేవు !


ఒరిజినల్ తమిళ పద్యం వైరముత్తుగారి కంఠస్వరంలో
http://www.youtube.com/watch?v=bzb2ojn5IZc